ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ క్రికెటర్లు దూరం.. బంగ్లా క్రికెట్ బోర్డుపై భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం

  • క్రికెటేతర కారణాలతో కప్‌నకు దూరం కావడం ఆ దేశ క్రికెటర్లను బాధపెడుతోందన్న తివారీ
  • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్న మనోజ్ తివారీ
  • అదే వేదికలపై ఆడతారా, లేదా అనేది బీసీబీ తేల్చుకోవాలన్న భారత మాజీ క్రికెటర్
రాజకీయ కారణాల వల్లే బంగ్లాదేశ్ క్రీడాకారులు ప్రపంచ కప్‌లో ఆడేందుకు రావడం లేదని, చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నాడు. క్రికెటేతర కారణాలతో ప్రపంచ కప్‌నకు దూరం కావడం ఆ దేశ క్రికెటర్లను బాధపెడుతోందని ఆయన పేర్కొన్నాడు. భద్రత కారణాల దృష్ట్యా టీ20 ప్రపంచ కప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం వెనుక రాజకీయ ప్రమేయం ఉందని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. ఇది నిజంగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు తీరని నష్టమని అన్నాడు. ప్రతి క్రీడాకారుడు దేశం తరఫున ప్రపంచ కప్‌లో ఆడాలని కోరుకుంటారని, కానీ ప్రస్తుతం ఆ దేశ ఆటగాళ్ల చేతుల్లో ఏమీ లేదని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఐసీసీ కూడా చాలా స్పష్టంగా ఉందని, వేదికలను మార్చడం కుదరదని తేల్చి చెప్పిందని గుర్తు చేశాడు. ఆడతారో లేదో బీసీబీ నిర్ణయించుకోవాలని అన్నాడు.

ఐసీసీ చాలా శక్తిమంతమైన సంస్థ అని మనోజ్ తివారీ పేర్కొన్నాడు. బీసీబీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నాడు. బయటి నుంచి చూసేవారికి ఇందులో బోర్డు పాత్ర ఏమీ లేదని తెలుస్తోందని అన్నాడు. క్రీడల్లో రాజకీయ జోక్యాలు ఉంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని వ్యాఖ్యానించాడు. కాగా, ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగితే దాని స్థానాన్ని ఐసీసీ స్కాట్లాండ్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది.


More Telugu News