హైదరాబాద్‌పై చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్... మెరుపు డబుల్ సెంచరీ

  • 219 బంతుల్లో 227 పరుగులు చేసిన ముంబై బ్యాటర్
  • కెప్టెన్ సిరాజ్ బౌలింగ్‌లో 39 బంతుల్లోనే 45 పరుగులు
  • ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 5,000 పరుగుల మైలురాయి దాటిన సర్ఫరాజ్
  • జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం బలమైన ప్రదర్శన
యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇవాళ‌ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ కేవలం 219 బంతుల్లోనే 227 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్ కెప్టెన్, టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో 39 బంతులు ఎదుర్కొని 45 పరుగులు పిండుకోవడం విశేషం. ఒక దశలో 82 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబైని, స్టాండ్-ఇన్ కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (104)తో కలిసి ఆదుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 249 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 5,000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు.

ఇటీవల కాలంలో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 2024 నవంబర్‌లో చివరిసారిగా భారత టెస్టు జట్టుకు ఆడిన సర్ఫరాజ్, తన నిలకడైన ప్రదర్శనలతో మళ్లీ జాతీయ జట్టు తలుపు తడుతున్నాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అతడిని రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.


More Telugu News