శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు

  • పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం
  • మంత్రి లోకేశ్‌ పుట్టినరోజు సందర్భంగా రూ.44 లక్షలు విరాళం
  • టీటీడీలోని వివిధ ట్రస్టులకు ఈ విరాళాలను కేటాయింపు
తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, అలాగే ఓ విద్యాసంస్థల అధినేత వేర్వేరుగా స్వామివారికి కోట్లాది రూపాయలను కానుకగా సమర్పించారు. ఈ విరాళాలను టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వివిధ సేవా ట్రస్టులకు కేటాయించారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ, టీటీడీ ట్రస్టులకు మొత్తం రూ. 2.50 కోట్లు విరాళంగా ఇచ్చింది. సంస్థ ప్రతినిధి రాజగోపాలరాజు, శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ విరాళంలో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు, విద్యాదాన ట్రస్టుకు చెరో రూ.75 లక్షలు ఉన్నాయి. అలాగే బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, అన్నప్రసాదం, గో సంరక్షణ ట్రస్టులకు చెరో రూ.25 లక్షలు చొప్పున అందించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.  పీఎల్‌రాజు కన్‌స్ట్రక్షన్స్ విరాళం అందించిన కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్‌ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.

మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం ఆయన రూ. 44 లక్షలు అందించారు. నేడు మంత్రి లోకేశ్‌ పేరిట టీటీడీ అన్నప్రసాద కేంద్రంలో ప్రత్యేకంగా అన్నదానం నిర్వహించారు.


More Telugu News