భర్తలపై తీవ్ర అసంతృప్తిలో జపాన్ మహిళలు

  • భర్తలపై 70 శాతం మంది జపాన్ మహిళల్లో అసంతృప్తి
  • కాలం వెనక్కి వెళితే ప్రస్తుత భర్తను పెళ్లి చేసుకోబోమన్న 54 శాతం మంది భార్యలు
  • ఆర్థిక స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న మహిళలు

జపాన్‌లో వివాహ బంధంపై తాజాగా వెలువడిన ఓ సర్వే ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సంప్రదాయాలకు పెద్దపీట వేసే జపాన్‌లోనే వివాహ జీవితంపై ఇంతటి అసంతృప్తి వ్యక్తమవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


జపనీస్‌ వివాహ సంబంధాల సంస్థ ‘ప్రెసియా’ నిర్వహించిన ఈ సర్వేలో, 20 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు గల 287 మంది వివాహిత మహిళలు పాల్గొన్నారు. వారిని ‘‘మీరు మీ భర్తను వివాహం చేసుకున్నందుకు చింతిస్తున్నారా?’’ అనే ఒక్క ప్రశ్న అడగగా, 70 శాతం మంది ‘అవును’ అని సమాధానమిచ్చారు. పెళ్లి చేసుకున్నందుకు జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో అయినా బాధపడ్డామని వారు వెల్లడించారు.


ఇందులో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కాలం వెనక్కి తిరిగితే తమ ప్రస్తుత భర్తను మళ్లీ పెళ్లి చేసుకోబోమని 54 శాతం మంది మహిళలు స్పష్టం చేయడం. ఈ గణాంకాలు జపాన్‌లో వివాహ బంధం వెనుక ఉన్న వాస్తవాలను బయటపెడుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


అసంతృప్తికి కారణాలివే:
  • ఆర్థిక పరిస్థితులే తమ అసంతృప్తికి ప్రధాన కారణమని 37.2 శాతం మంది మహిళలు  తెలిపారు.

  • తాము ఆశించిన దానికంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నామని 22.6 శాతం మంది పేర్కొన్నారు.

  • భర్తలకు సరైన ఆర్థిక అవగాహన లేదని 14.6 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • ఇంటిపనుల్లో భర్త సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 11.11 శాతం మంది తెలిపారు.


ఇదే సమయంలో, మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. 36.6 శాతం మంది మహిళలు భర్త శారీరక రూపం విషయంలో రాజీపడటం తమకు పెద్ద సమస్య కాదని వెల్లడించారు. అంటే, అందం కన్నా ఆర్థిక స్థిరత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని సర్వే ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు.


జపాన్‌లో రోజురోజుకీ పెరుగుతున్న జీవన వ్యయం, పిల్లల పెంపకం ఖర్చులు, భవిష్యత్ భద్రతపై ఉన్న ఆందోళనలు మహిళల ఆలోచనలను మారుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘ప్రేమ’ కంటే ‘ఆర్థిక భద్రతే’ ముఖ్యమనే భావన బలపడుతోందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.



More Telugu News