జైల్లో ప్రేమ.. పెళ్లి పీటలెక్కిన హత్య కేసు దోషులు!

  • హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీల వివాహం
  • జైపూర్‌లోని ఓపెన్ జైల్లో చిగురించిన ప్రేమ
  • పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేసిన రాజస్థాన్ హైకోర్టు 
  • హనీట్రాప్ హత్య కేసులో ప్రియ, ఐదుగురి హత్య కేసులో హనుమాన్ దోషులు
రాజస్థాన్‌లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటవుతున్నారు. జైపూర్‌లోని ఓపెన్ జైల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్‌పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్‌లో ఇవాళ‌ వీరి వివాహం జరగనుంది. 

వివరాల్లోకి వెళితే.. హనీట్రాప్ చేసి దుష్యంత్ శర్మ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రియ సేథ్ (33) యావజ్జీవ శిక్ష అనుభవిస్తోంది. మరోవైపు 2017లో అల్వార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో హనుమాన్ ప్రసాద్ అలియాస్ జాక్ (32) జీవిత ఖైదీగా ఉన్నాడు. వీరిద్దరినీ ఏడాది క్రితం జైపూర్ సెంట్రల్ జైల్ నుంచి సంగనేర్‌లోని ఓపెన్ జైలుకు మార్చారు.

ఓపెన్ జైల్లో వీరి మధ్య పరిచయం ఏర్పడి, ఆరు నెలల క్రితం అది ప్రేమగా మారింది. గత నాలుగు నెలలుగా జైలు ప్రాంగణంలోనే ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, తమ కుటుంబాలకు తెలిపారు. డిసెంబర్‌లో పెరోల్ కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యర్థనలో భాగంగా కోర్టుకు పెళ్లి పత్రికను కూడా సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా పెరోల్ సలహా కమిటీ వీరికి పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేసింది.

అల్వార్ జిల్లాలోని హనుమాన్ ప్రసాద్ పూర్వీకుల ఇంట్లో మూడు రోజుల వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ప్రియ, హనుమాన్ గతంలో తాము నేరం చేసిన సమయంలో ఉన్న భాగస్వాములు కూడా ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండటం గమనార్హం. జైలు గోడల మధ్య మొదలైన ఈ వినూత్న ప్రేమకథ, పెళ్లి ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


More Telugu News