అమెరికాలో 5 ఏళ్ల బాలుడి అరెస్ట్.. తీవ్ర దుమారం

  • బాలుడిని అదుపులోకి తీసుకున్న ఐస్ ఏజెంట్లు
  • బాలుడిని ఎరగా వాడుకున్నారని స్కూల్ అధికారుల తీవ్ర ఆరోపణ
  • తండ్రే బాలుడిని వదిలి పారిపోయాడని చెబుతున్న హోంల్యాండ్ సెక్యూరిటీ
  • ఈ ఘటన దారుణమంటూ మండిపడ్డ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్
  • టెక్సాస్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తండ్రీకొడుకుల తరలింపు
అమెరికాలో ఐదేళ్ల బాలుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మిన్నసోటా రాష్ట్రంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఏజెంట్లు ఈ చర్యకు పాల్పడగా, ఈ ఘటనపై రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. బాలుడిని 'ఎర'గా వాడుకున్నారని పాఠశాల అధికారులు ఆరోపిస్తుండగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఈ ఆరోపణలను ఖండించింది.

ఈ ఘటనపై అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం "లియామ్ రామోస్ ఇంకా పసివాడు. అతడిని ఐస్ ఏజెంట్లు ఎరగా వాడటం దారుణం. ఇది నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది" అని ఆమె అన్నారు. అయితే, ఈ ఆపరేషన్‌ను ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు. చట్టాన్ని అమలు చేస్తున్న అధికారులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

మంగళవారం కొలంబియా హైట్స్‌లో 5 ఏళ్ల లియామ్ రామోస్, అతడి తండ్రి ఏడ్రియన్ ఏరియాస్‌ను వారి ఇంటి వద్ద ఐస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్లు బాలుడి చేత ఇంటి తలుపు తట్టించి, లోపల ఎవరైనా ఉన్నారేమోనని చూశారని, ఇది బాలుడిని ఎరగా వాడటమేనని స్కూల్ సూపరింటెండెంట్ జెనా స్టెన్‌విక్ ఆరోపించారు. కానీ, బాలుడి తండ్రి పారిపోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో బాలుడి భద్రత కోసమే తమ అధికారులు అతడితో ఉన్నారని డీహెచ్ఎస్ వాదిస్తోంది.

ప్రస్తుతం తండ్రీకొడుకులిద్దరినీ టెక్సాస్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారిని అదుపులోకి తీసుకున్నారని కుటుంబ న్యాయవాది తెలిపారు. గత రెండు వారాల్లో ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ నుంచి ఐస్ ఏజెంట్ల చేతికి చిక్కిన నాలుగో విద్యార్థి లియామ్ కావడం గమనార్హం.


More Telugu News