డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చాలా?.. ఆన్‌లైన్‌లో సులభంగా చేసుకోండిలా!

  • ఆన్‌లైన్‌లో సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ చిరునామా మార్పు
  • రాష్ట్రం మారితే పాత ఆర్టీవో నుంచి ఎన్‌వోసీ తప్పనిసరి
  • పరివహన్ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ
ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర కారణాలతో స్వస్థలం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది హైదరాబాద్‌లో స్థిరపడుతుంటారు. అయితే, పాత చిరునామాతో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌ను కొత్త చిరునామాకు మార్చుకోవడంలో చాలామంది అశ్రద్ధ చూపుతారు. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్‌పై ప్రస్తుత నివాస చిరునామా ఉండటం తప్పనిసరి. ఈ ప్రక్రియను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ‘పరివహన్’ పోర్టల్ ద్వారా ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులభతరం చేసింది.

చిరునామా మార్పు కోసం దరఖాస్తుదారులు ముందుగా పరివహన్ సేవా (parivahan.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ 'ఆన్‌లైన్ సర్వీసెస్' విభాగంలో 'డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు' ఎంచుకోవాలి. అనంతరం, తాము నివసిస్తున్న రాష్ట్రాన్ని (ఉదాహరణకు తెలంగాణ) ఎంపిక చేసుకుని, 'చేంజ్ ఆఫ్ అడ్రస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. డీఎల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేశాక, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, నిర్ణీత రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు (ఉదా: ఏపీ నుంచి తెలంగాణకు) పాత ఆర్టీవో కార్యాలయం నుంచి నిరభ్యంతర పత్రం (NOC) తీసుకోవడం తప్పనిసరి. దరఖాస్తుతో పాటు ఫామ్ 33, ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ పత్రం (ఆధార్, పాస్‌పోర్ట్, కరెంట్ బిల్లు వంటివి), ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పీయూసీ సర్టిఫికెట్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్ విధానం వల్ల ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరిగే అవసరం లేకుండానే ప్రజలు తమ డ్రైవింగ్ లైసెన్స్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.


More Telugu News