తెలంగాణలో బీసీ నేత సీఎం అయ్యే సమయం వస్తుంది: మహేశ్ కుమార్ గౌడ్
- అవకాశం ఉన్న ప్రతి చోట బీసీలకు పదవులు ఇస్తున్నామన్న మహేశ్ గౌడ్
- మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యమని వెల్లడి
- దేవుళ్ల పేరుతో రాజకీయాలు మంచిది కాదని వ్యాఖ్య
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ నేత ముఖ్యమంత్రి అయ్యే ఆ సమయం తప్పకుండా వస్తుందని అన్నారు. మున్ముందు బీసీలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, అవకాశం ఉన్న ప్రతి చోట బీసీలకు పదవులు ఇస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు.
కష్టపడి పనిచేస్తే ఎవరి వాటా వాళ్లకు దక్కుతుందని, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరని మహేశ్ గౌడ్ అన్నారు. రాబోయే రోజులు అన్నీ బీసీలవే అని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం దేశానికి మంచిది కాదని, కులం, మతం పేరుతో మన పిల్లలకు భవిష్యత్తు రాదని వ్యాఖ్యానించారు. రాముడు, అంజనేయుడి పేర్లు చెప్పి బీజేపీ నేతలు ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు.
అర్వింద్ ‘జై శ్రీరాం’ అని కాకుండా, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి తాను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడగాలని హితవు పలికారు. రాముని పేరు చెప్పడం తప్ప నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏం చేశారో వివరించాలన్నారు. దేవుళ్లను రాజకీయాలతో ముడిపెట్టవద్దని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.