ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ

  • ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానని స్పష్టం చేసిన జగన్
  • భూముల సమగ్ర రీసర్వేలో చంద్రబాబుది 'క్రెడిట్ చోరీ' అని తీవ్ర ఆరోపణ
  • కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శలు
  • ఏడాది తర్వాత పాదయాత్ర చేపట్టి ప్రజల్లోనే ఉంటానని ప్రకటన
  • తన ఎమ్మెల్యేలు సభకు రాకపోవడంపై స్పీకర్ వ్యాఖ్యలకు జగన్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కీలక ప్రకటన చేశారు. తనకు ప్రతిపక్ష నేత (LOP) హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలను, తప్పుడు పనులను సభలో ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని, అప్పుడే తనకు తగినంత సమయం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్‌కు ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. "అసెంబ్లీలో ఉన్నది ఒక్కటే ప్రతిపక్షం, అది వైసీపీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములే. మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా అని మీరు స్పీకర్‌ను ప్రశ్నించాలి" అని జగన్ అన్నారు. 

అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు "పని చేయకపోతే జీతం లేదు" (నో వర్క్, నో పే) విధానం అమలు చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిన్న లక్నోలో జరిగిన సదస్సులో సూచించిన నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు 2024 నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే.

భూ సర్వేలో చంద్రబాబుది ‘క్రెడిట్ చోరీ’

భూముల సమగ్ర రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'క్రెడిట్ చోరీ'కి పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 'భూ రక్ష', 'భూ హక్కు' పథకాలను చంద్రబాబు హైజాక్ చేశారని, ఈ బృహత్కార్యంలో ఆయన పాత్ర ఏమాత్రం లేకపోయినా ఘనతను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

తన పాదయాత్ర సందర్భంగా రైతులు భూ వివాదాలు, టైటిల్స్ సమస్యలపై తన వద్ద గోడు వెళ్లబోసుకున్నారని, అందుకే 2019 మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చామని గుర్తుచేశారు. తమ హయాంలో రూ.6,000 కోట్లు ఖర్చు చేసి, దాదాపు 40,000 మంది సిబ్బందిని నియమించి అత్యాధునిక టెక్నాలజీతో సమగ్ర భూ సంస్కరణలు చేపట్టామని, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని తెలిపారు.

కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, రైతులకు గతంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలను వెనక్కి తీసుకుని, వాటి రంగు మార్చి మళ్లీ ఇస్తూ మొత్తం ఘనత తనదేనని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కొత్త పాస్‌బుక్‌లలో తప్పులు ఎక్కువగా ఉండటంతో రైతుల కష్టాలు మరింత పెరిగాయన్నారు. అంతేకాకుండా, ఈ పథకం అమలును ప్రశంసిస్తూ కేంద్రం ఇచ్చిన రూ.400 కోట్ల నిధులను కూడా టీడీపీ నాయకత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించడం సంచలనం రేపింది.

ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు

కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని జగన్ ఆరోపించారు. సంక్రాంతి జూదం, గ్రామాల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలు, పైనుంచి కింది వరకు కమీషన్ల దందా నడుస్తోందని విమర్శించారు. ఇసుక ధరలు రెట్టింపు అయినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదని, ఆ డబ్బు ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. అమరావతి పనుల్లో తమకు అనుకూలమైన కొద్దిమంది కాంట్రాక్టర్లకే అధిక రేట్లకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ వ్యతిరేకత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు, సరైన సమయంలో పాదయాత్ర చేస్తామని జగన్ తెలిపారు. ఏడాది తర్వాత పాదయాత్ర చేపట్టి, మరో ఏడాది పాటు ప్రజల మధ్యే రోడ్లపై ఉంటామని పార్టీ సమావేశంలో చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు.




More Telugu News