టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్

  • టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు గౌరవ డాక్టరేట్
  • పుణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ నుంచి సత్కారం
  • క్రికెట్‌కు చేసిన సేవలకు, నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం
  • శనివారం జరగనున్న స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారు
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. క్రికెట్ రంగానికి ఆయన అందించిన విశేష సేవలు, అద్భుతమైన నాయకత్వ పటిమకు గుర్తింపుగా పుణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ (ADYPU) గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ లెటర్స్ - D.Litt.) ప్రదానం చేయనుంది.

శనివారం జరగనున్న యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవంలో రోహిత్ శర్మ ఈ గౌరవాన్ని అందుకోనున్నాడు. వర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ అజీంక్య డీవై పాటిల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. క్రీడా రంగంలో రోహిత్ సాధించిన విజయాలు, ప్రపంచ వేదికపై ఆయన కనబరిచిన నాయకత్వ లక్షణాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

38 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా, వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. హిట్ మ్యాన్ సారథ్యంలోనే భారత జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. రోహిత్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు టైటిల్ అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

గతంలో అర్జున అవార్డు (2015), మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న (2020) వంటి జాతీయ పురస్కారాలు అందుకున్న రోహిత్ కెరీర్‌లో ఈ గౌరవ డాక్టరేట్ మరో మైలురాయిగా నిలవనుంది. ఈ నేపథ్యంలో అభిమానులు, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రోహిత్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.


More Telugu News