పార్టీ నేతలకు కీలక సూచన చేసిన పవన్ కల్యాణ్
- ఇతర వ్యక్తుల మధ్య జరిగే వాటిని జనసేనకు ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న పవన్
- వివాహేతర సంబంధాలను కూడా జనసేనపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్య
- దుష్ప్రచాలను పార్టీ శ్రేణులు ఖండించాలని సూచన
జనసేన పార్టీపై ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు కాపు కాస్తున్నారని... పార్టీ పట్ల వారికున్న నిబద్ధత చాలా గొప్పదని ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. సంస్థాగత అంశాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేన పార్టీకి ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రత్యేకంగా వివాహేతర సంబంధాలు వంటి వ్యక్తిగత అంశాలను కూడా జనసేనపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని పవన్ పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ విధమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాలని సూచించారు.