తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

  • జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు
  • రేపు పెద్దారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని జేసీ వర్గీయుల హెచ్చరిక
  • భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాటికి టీడీపీ నేతలు ఇచ్చిన ప్రతిసవాళ్లతో పట్టణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.


వారం క్రితం తాడిపత్రి అభివృద్ధిపై పెద్దారెడ్డి మాట్లాడుతూ.. “అనంతపురం టవర్‌క్లాక్‌, కర్నూలు కొండారెడ్డి బురుజు, కడప కోటిరెడ్డి సర్కిల్‌… ఎక్కడికైనా రా” అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీనికి ప్రతిగా టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు స్పందించారు. “అక్కడికెక్కడికో ఎందుకు? భగత్‌సింగ్ నగర్‌లో ఉన్న పెద్దారెడ్డి ఇంటి వద్దకే వస్తాం... అక్కడే సవాల్ స్వీకరిస్తాం” అంటూ పెద్దారెడ్డికి కౌంటర్ ఇచ్చారు.


ఇదే సమయంలో పెద్దారెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం లోపు కేసులు నమోదు చేయకపోతే 23వ తేదీన పెద్దారెడ్డి ఇంటిని ముట్టడిస్తాం అంటూ హెచ్చరించారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి రావాలని పిలుపునిచ్చారు.


ఈ పరిణామాలతో తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు.. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి జిల్లా అధికారులతో పాటు కిందిస్థాయి పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. 


రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో తాడిపత్రి ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా భగత్‌సింగ్ నగర్‌, సంజీవ నగర్‌ ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. పట్టణానికి భారీగా పోలీసు బలగాలు వస్తున్నాయన్న ప్రచారం కూడా ప్రజల్లో టెన్షన్ పెంచుతోంది.



More Telugu News