ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు విజయసాయి
- ఈ కేసులో విజయసాయిని ఏ5గా చేర్చిన సిట్
- రేపు విచారణకు హాజరుకానున్న మిథున్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందన్న అనుమానాలతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఏ5 నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. గతేడాది మేలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేయగా, ఇప్పుడు విచారణను ముమ్మరం చేసింది.
2019 నుంచి 2024 మధ్య రూపొందించిన మద్యం విధానంలో విజయసాయిరెడ్డి పాత్ర ఏమిటి? మద్యం కంపెనీల నుంచి వచ్చిన లంచాలు, షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా విదేశాలకు నిధుల మళ్లింపు వంటి అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్టు సమాచారం. ఈ విచారణలో ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నారు.
ఇదే కేసులో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రేపు (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని అధికారులు పిలిచారు. ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసి, బెయిల్‌పై ఉన్న మిథున్ రెడ్డిని ఇప్పుడు మనీలాండరింగ్ కోణంలో ప్రశ్నించనున్నారు.
వరుసగా ఇద్దరు కీలక నేతలు ఈడీ విచారణ ఎదుర్కొంటుండటంతో ఏపీ రాజకీయాల్లో ఈ లిక్కర్ స్కామ్ కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి పెరుగుతోంది.