కరాటే కల్యాణిపై దాడి కేసులో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్

  • టీటీడీ పేరుతో లక్కీ డ్రా మోసాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు
  • ఆదిభట్ల వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కరాటే కల్యాణి
  • నరేందర్‌పై గతంలో చైన్ స్నాచింగ్ కేసు కూడా ఉన్నట్టు గుర్తింపు
  • నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పంజాగుట్ట పోలీసులు
సినీ నటి కరాటే కల్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్‌ను హైదరాబాడులోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే క్రమంలో ఈ దాడి జరిగింది. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.

వివరాల్లోకి వెళితే.. టీటీడీ పేరుతో నరేందర్ లక్కీ డ్రా నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని కరాటే కల్యాణి గతంలోనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.399కే ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్ వంటి బహుమతులు ఇస్తామని నమ్మిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఆదిభట్ల సమీపంలోని వండర్లా వద్ద నరేందర్ లక్కీ డ్రా ప్రచారం చేస్తుండగా, కరాటే కల్యాణి పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే సమయంలో నరేందర్, అతని అనుచరులు సుమారు 10 మంది తనపై దాడికి యత్నించారని, చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నరేందర్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 74, 75, 79, 115(2), 132, 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.

విచారణలో నరేందర్‌పై గతంలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. మోసాలు, దాడి ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News