మూసీ ప్రక్షాళన.. క్రీడా వసతులు.. తెలంగాణకు టాటా గ్రూప్ అండ

  • దావోస్‌లో టాటా గ్రూప్‌తో పలు కీలక ప్రాజెక్టులకు తెలంగాణ ఒప్పందం
  • మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగస్వామి కానున్న టాటా
  • హైదరాబాద్ క్రీడా మైదానాల అభివృద్ధికి టాటా చేయూత
  • పుణ్యక్షేత్రాల్లో హోటళ్ల నిర్మాణానికి టాటా ఆసక్తి
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో తెలంగాణ ప్రభుత్వం భారీగా పెట్టుబడులను రాబ‌ట్టింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జరిపిన చర్చల ఫలితంగా రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులలో భాగస్వామి అయ్యేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్‌లో ముఖ్యమంత్రి, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో జరిపిన భేటీలో ఈ మేరకు కీలక ఒప్పందాలు కుదిరాయి.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు'లో భాగస్వామి కావడానికి టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాజస్థాన్, మహారాష్ట్రలలో నీటి వనరుల పునరుద్ధరణలో తమకున్న అనుభవాన్ని ఈ ప్రాజెక్టుకు ఉపయోగిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు. కేవలం నదిని శుభ్రపరచడమే కాకుండా, మూసీ పరీవాహక ప్రాంతాన్ని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.

దీంతో పాటు హైదరాబాద్‌లోని క్రీడా మైదానాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు టాటా గ్రూప్ చేయూత అందించనుంది. 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ' ఏర్పాటు, 2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని క్రీడా మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అలాగే భద్రాచలం, మేడారం, వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, రిసార్టులు నిర్మించేందుకు కూడా టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. ఈ ఒప్పందాలు రాష్ట్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.


More Telugu News