జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్

  • ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్న వైఎస్ జగన్
  • ఇకపై ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అవుతానని వెల్లడి
  • ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్న జగన్
ఏలూరులో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ఏ వర్గానికీ మేలు చేయలేదని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, “జగన్ ఉంటే బాగుండేదని” ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇంకో మూడేళ్లేనని అన్నారు.

ఇక తాను ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేశారు. ఈ ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతో మొదలు పెడుతున్నామని తెలిపారు.

చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, మోసాలేనని ఆరోపించిన జగన్.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఎవరితోనైనా ఎలా కావాలంటే అలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

అలాగే, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిందని జగన్ అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు డిమాండ్ ఉండేదని, ఇప్పుడు విద్యార్థులు భారీగా చదువు మానేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీలను కూడా ఈ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని జగన్ ఆరోపించారు. 


More Telugu News