భారత్‌లో ఆడేది లేదన్న బంగ్లా.. మద్దతుగా ఐసీసీకి పాక్ లేఖ..!

  • 2026 టీ20 ప్రపంచకప్‌కు కొత్త చిక్కులు
  • భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత
  • బంగ్లా వైఖరికి మద్దతిస్తూ ఐసీసీకి పాకిస్థాన్ లేఖ రాసిన వైనం
  • తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బీసీబీ డిమాండ్
  • నేడు ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ
2026 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత చూపగా, ఇప్పుడు ఆ దేశానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మద్దతుగా నిలిచింది. ఈ మేరకు పీసీబీ మంగళవారం ఐసీసీకి ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది.

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో కథనం ప్రకారం.. భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరిస్తున్న వైఖరిని తాము సమర్థిస్తున్నట్లు పీసీబీ తన లేఖలో పేర్కొంది. ఈ లేఖ కాపీలను ఐసీసీ బోర్డు సభ్యులకు కూడా పంపినట్లు సమాచారం. ఈ వివాదంపై బీసీబీ, ఐసీసీ మధ్య బుధవారం జరిగిన సమావేశంలో ఎవరి వాదనకు వారే కట్టుబడినట్లు తెలిసింది. షెడ్యూల్ ప్రకారమే టోర్నీ జరగాలని ఐసీసీ స్పష్టం చేయగా, భారత్‌కు తమ జట్టును పంపలేమని బీసీబీ తేల్చిచెప్పింది.

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బీసీబీ పట్టుబడుతోంది. తమను గ్రూప్-బీకి మార్చి, శ్రీలంకలో ఆడే ఐర్లాండ్‌తో స్థానాలు మార్చాలని కూడా బంగ్లాదేశ్ సూచించింది.తమను గ్రూప్-బీకి మార్చి, శ్రీలంకలో ఆడనున్న ఐర్లాండ్‌ను త‌మ‌ గ్రూప్ కు మార్చాలని ప్రతిపాదించింది. కానీ, ఐసీసీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. 

బంగ్లాదేశ్ డిమాండ్‌ను అంగీకరించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాకిస్థాన్ గతంలోనే హెచ్చరించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. ఈ వివాదంపై ఐసీసీ ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


More Telugu News