యూఏఈ ఆర్థిక మంత్రితో చంద్రబాబు కీలక భేటీ
- దావోస్‌లో అల్ మార్రీతో చంద్రబాబు సమావేశం
- మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు అంశంపై చర్చ
- ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కలిసి పనిచేయడానికి ఇరు పక్షాల అంగీకారం
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యూఏఈ ఆర్థిక మంత్రి అల్ మార్రీతో సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.
ఏపీ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కలిసి పనిచేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా యూఏఈకి చెందిన దాదాపు 40 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని అల్ మార్రీ వెల్లడించడం విశేషం. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతులకు ఇది పెద్ద అవకాశంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.
అలాగే ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది. పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల రంగాల్లోనూ యూఏఈ పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీతో ఏపీకి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు వచ్చే అవకాశాలు మరింత పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.