పుట్టినరోజున ఫ్యాన్స్‌కు ట్రీట్.. ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్

  • వరుణ్ తేజ్ 15వ చిత్రానికి టైటిల్ ఖరారు
  • 'కొరియన్ కనకరాజు'గా రానున్న మెగా ప్రిన్స్
  • పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ విడుదల
  • ఇండో-కొరియన్ హారర్ కామెడీగా సినిమా 
  • 2026 వేసవిలో థియేటర్లలోకి రానున్న చిత్రం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మెర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. 'VT15' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'కొరియన్ కనకరాజు' అనే పేరును ఖరారు చేస్తూ సోమవారం వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.  

విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. కనకరాజు అనే వ్యక్తి కోసం కొరియా పోలీసులు ఓ భారతీయ ఫొటోగ్రాఫర్‌ను చిత్రహింసలు పెట్టడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఇంతలో పౌర్ణమి రాత్రి కనకరాజు (వరుణ్ తేజ్) ఓ ఆత్మ ఆవహించిన వాడిలా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి, సమురాయ్ కత్తితో పోలీసులను అంతం చేస్తాడు. చివర్లో అతను కొరియన్ భాషలో 'నేను తిరిగొచ్చాను' అని చెప్పడం, "ఈ కనకరాజు మన కనకరాజు కాదు" అంటూ ఫొటోగ్రాఫర్ చెప్పే డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఇండో-కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, పనీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం, కొరియాలలో కీలక షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2026 వేసవిలో థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.



More Telugu News