మేడారం జాతరకు ఏఐ సొబగులు.. డ్రోన్లు, జియో ట్యాగ్‌లతో హైటెక్ నిఘా

  • మేడారం జాతరకు తొలిసారిగా ఏఐ సాంకేతికత వినియోగం
  • డ్రోన్లు, హీలియం బెలూన్లతో గగనతలం నుంచి ప్రత్యేక నిఘా
  • తప్పిపోయిన వారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్ విధానం
  • ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరగాళ్లపై పోలీసుల పర్యవేక్షణ
దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఈసారి ఆధునిక సాంకేతిక హంగులతో జరగనుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఈ చారిత్రక ఘట్టానికి తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ మునుపెన్నడూ లేనివిధంగా కృత్రిమ మేధ (AI) ఆధారిత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రతా వ్యవస్థ పనితీరును పరిశీలించారు.

జాతర భద్రత కోసం ‘మేడారం 2.0’ పేరుతో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ‘టీజీ-క్వెస్ట్‌’ అనే ఏఐ డ్రోన్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఇవి దాదాపు 30 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ మార్గాలపై గగనతలం నుంచి నిరంతరం నిఘా ఉంచుతాయి. వీటితో పాటు ఆకాశంలో ఎగిరే హీలియం బెలూన్లకు పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలను అమర్చారు. ఇవి అత్యంత ఎత్తు నుంచి జనసమూహాన్ని విశ్లేషించి, తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తాయి. ఈ హైటెక్ నిఘా నీడలో సుమారు 13 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.

పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక జియో ట్యాగ్‌లు
గత జాతరలో వేలాది మంది తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి వొడాఫోన్-ఐడియా సహకారంతో ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్ల వద్ద వృద్ధులు, పిల్లల వివరాలు నమోదు చేసి, వారికి క్యూఆర్ కోడ్ ఉండే జియోట్యాగ్‌ను చేతికి కడతారు. ఒకవేళ వారు తప్పిపోతే, ఈ ట్యాగ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారి వివరాలు సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించవచ్చు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలోనూ అమలు చేస్తున్నారు.

నేరగాళ్లను గుర్తించేందుకు 'ఫేస్ రికగ్నిషన్' టెక్నాలజీ
జాతరలో నేరగాళ్లను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా వాడుతున్నారు. ఆసుపత్రి, పార్కింగ్ స్థలాల వంటి కీలక ప్రదేశాల్లో పాత నేరస్థుల కదలికలను ఈ సాంకేతికత ద్వారా పసిగడతారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించేందుకు రియల్-టైమ్ అలర్ట్ సిస్టమ్ సైతం పనిచేస్తుంది. భక్తుల సౌకర్యం కోసం 2,000 ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలు, 50కి పైగా అనౌన్స్‌మెంట్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


More Telugu News