ప్రేమించాడని నరకం.. యువకుడిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ప్రియురాలి కుటుంబం!

  • ప్రేమ వ్యవహారంలో యువకుడికి ప్రియురాలి కుటుంబం నరకం
  • భోపాల్ నుంచి రాజస్థాన్‌కు పిలిపించి కిడ్నాప్, దాడి
  • బలవంతంగా మూత్రం తాగించి వీడియో తీసి కుటుంబానికి పంపిన వైనం
  • ఘటనపై రెండు రాష్ట్రాల పోలీసుల సంయుక్త దర్యాప్తు
ప్రేమ వ్యవహారం ఓ యువకుడి పాలిట నరకంగా మారింది. ప్రియురాలి కుటుంబ సభ్యులు అతడిని కిడ్నాప్ చేసి, మూడు రోజుల పాటు నిర్బంధించి, అత్యంత అమానుషంగా హింసించారు. చితకబాది, బీరు బాటిల్‌లో మూత్రం నింపి బలవంతంగా తాగించారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బాధితుడి కుటుంబానికి పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

భోపాల్‌లోని కోలార్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల సోను, రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా పులోరో గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. 15 రోజుల క్రితం ఆ యువతి ఇంటి నుంచి వచ్చేసి భోపాల్‌లో సోనుతో కలిసి జీవించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని యువతిని బలవంతంగా తిరిగి రాజస్థాన్‌కు తీసుకెళ్లారు.

అనంతరం, యువతితోనే సోనుకు ఫోన్ చేయించి కలవాలని చెప్పి రాజస్థాన్‌కు రప్పించారు. అక్కడికి చేరుకున్న సోనును యువతి కుటుంబ సభ్యులు పట్టుకుని, మూడు రోజుల పాటు నిర్బంధించి దారుణంగా కొట్టారు. అనంతరం మూత్రం తాగించి వీడియో తీశారు. ఆ వీడియోను సోను కుటుంబానికి పంపడంతో వారు షాక్‌కు గురై, వెంటనే భోపాల్‌లోని కోలార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కోలార్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ సోని స్పందిస్తూ "ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని రాజస్థాన్‌కు పంపించాం. అక్కడి పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాం. బాధితుడి వాంగ్మూలం నమోదు చేస్తున్నాం, వీడియోను పరిశీలిస్తున్నాం. నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై మధ్యప్రదేశ్, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News