మత వివక్ష వ్యాఖ్యలపై ఏఆర్ రెహమాన్ వివరణ.. వీడియో ఇదిగో!

  • ఏ ఒక్కరి సెంటిమెంట్లనూ నొప్పించాలనేది తన ఉద్దేశం కాదన్న రెహమాన్
  • తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడి
  • భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని వ్యాఖ్య
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. గడిచిన ఎనిమిదేళ్లుగా తనకు అవకాశాలు తగ్గాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. హిందీ చిత్ర పరిశ్రమలో మత వివక్ష కొనసాగుతోందనే రీతిలో ఆయన మాటలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. దీనిపై బాలీవుడ్ ప్రముఖులు సహా పలువురు తీవ్రంగా తప్పుబట్టడంతో రెహమాన్ తాజాగా వివరణ ఇచ్చారు. ఇన్ స్టా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

ఎవరినీ నొప్పించాలనేది తన ఉద్దేశం కాదని వీడియోలో చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. సంగీతమే తన ప్రపంచమని, సంగీతంతోనే తాను సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తానని, భారతీయుడిగా పుట్టినందుకు తాను గర్విస్తున్నానని చెప్పారు. భారత్ తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, భారత దేశమే తనకు గురువు, తన ఇల్లు అని చెప్పారు. ఒక్కోసారి మన వ్యాఖ్యల వెనుకున్న ఉద్దేశాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉందనే విషయం తనకు తెలుసన్నారు. అయితే, ఎప్పుడూ ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని రెహమాన్ ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు.

రెహమాన్ ఏమన్నారంటే..
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమ గురించి రెహమాన్ మాట్లాడుతూ.. "గత 8 సంవత్సరాలలో నాకు అవకాశాలు తగ్గాయి. ఇందులో మతపరమైన కారణాలు కూడా ఉండవచ్చు. అయితే, నాతో ఎవరూ అనలేదు. బహుశా అధికారం మారడం వల్లనేమో సృజనాత్మకత లేని వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు" అని అన్నారు.


More Telugu News