యూసుఫ్ గూడలో పేలిన వాషింగ్ మెషిన్.. వీడియో ఇదిగో!

  • తొలుత మంటలు.. కాసేపటికే భారీ శబ్దంతో పేలుడు
  • మెషిన్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • తుక్కుతుక్కుగా మారిన మెషిన్.. దెబ్బతిన్న ఇంట్లోని సామగ్రి
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పరిధిలో ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ పేలిపోయింది. తొలుత మెషిన్ నుంచి మంటలు వచ్చాయని, కాసేపటికే భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని ఆ ఇంట్లో వాళ్లు చెప్పారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వాషింగ్ మెషిన్ దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మెషిన్ పేలుడుకు ఆ గదిలోని పలు వస్తువులు దెబ్బతిన్నాయని, వాషింగ్ మెషిన్ మొత్తం తుక్కుతుక్కుగా మారిందని వివరించారు. 

వివరాల్లోకి వెళితే..

యూసుఫ్ గూడ పరిధిలోని కృష్ణానగర్ లో సయ్యద్ గౌస్ కు రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. సెకండ్ ఫ్లోర్ లోని పోర్షన్ ను అద్దెకు తీసుకున్న సాంబశివారెడ్డి అనే వ్యక్తి.. అందులో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్ ఆన్ చేయగా అందులో నుంచి మంటలు వచ్చాయి. కాసేపటికి పొగతోపాటు పెద్ద శబ్దంతో వాషింగ్ మెషిన్ పేలిపోయింది.

వాషింగ్ మెషిన్ ముక్కలుముక్కలైంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఈ దుర్ఘటనలో ఇల్లంతా చిందరవందర కాగా పలు వస్తువులు పాడైపోయాయి. అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవరికీ గాయాలు కాలేదని సాంబశివారెడ్డి తెలిపారు.


More Telugu News