వెనెజువెలా మరో ఇరాక్ కాకూడదనే..!: మీడియాకు వివరించి చెప్పిన ట్రంప్

  • ఇరాక్ లో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసిందన్న అమెరికా అధ్యక్షుడు
  • వెనెజువెలా మరో ఇరాక్ కాకూడదనే డెల్సీకి బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడి
  • మచాడోకు ప్రజల్లో అంతగా ఆదరణలేదన్న ట్రంప్
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను అమెరికా బలగాలు అరెస్టు చేసి ఫ్లోరిడా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. మదురో అరెస్టు తర్వాత వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ప్రమాణం చేశారు. తొలుత వెనెజువెలాను అమెరికానే పాలిస్తుందని ప్రకటించిన ట్రంప్.. తర్వాత డెల్సీకి మద్దతు తెలిపారు. వెనెజువెలా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని ఆశించిన మరియా కొరినా మచాడోకు నిరాశ తప్పలేదు.

అయితే, మచాడోను కాదని డెల్సీకి బాధ్యతలు అప్పగించడం వెనకున్న అసలు విషయాన్ని ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు వైట్ హౌస్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇరాక్ లో ఏం జరిగిందో మీకందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. 2003లో ఇరాక్ పై దాడి చేసి సద్దాం హుస్సేన్ ను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత ఇరాక్ ప్రభుత్వంలోని పలువురు అధికారులను అమెరికా పదవిలో నుంచి తప్పించింది.

కీలక అధికారులను తప్పించడంతో ఇరాక్ లో పవర్ వ్యాక్యూం ఏర్పడి అసాంఘిక శక్తులకు ఊతం లభించిందని ట్రంప్ గుర్తుచేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్ గా మారిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) పుట్టుకొచ్చిందని ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం వెనెజువెలా విషయంలో ఆ పొరపాటుకు తావివ్వకూడదనే ఉద్దేశంతో మచాడోకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. మదురో పాలనలో ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న డెల్సీ రోడ్రిగ్జ్ కే బాధ్యతలు అప్పజెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు.


More Telugu News