భారత్ కు మరిన్ని రఫేల్ యుద్ధ విమానాలు... డీపీబీ గ్రీన్ సిగ్నల్

  • 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు ఆయుధ సేకరణ బోర్డు ఆమోదం
  • రక్షణ మంత్రి నేతృత్వంలోని డీఏసీ ముందుకు వెళ్లనున్న ఫైల్
  • వచ్చే నెలలోనే భారత్, ఫ్రాన్స్ మధ్య తుది ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం
  • హైదరాబాద్‌లోని టాటా ప్లాంట్‌లో రఫేల్ ఫ్యూజ్‌లేజ్‌ల తయారీకి ఒప్పందం
భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ నుంచి మరో 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఆయుధ సేకరణ బోర్డు (డీపీబీ) శుక్రవారం ఆమోదం తెలిపింది. భారత వాయుసేన (ఐఏఎఫ్) గత ఏడాది ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖకు అధికారికంగా ప్రతిపాదన పంపిన విషయం తెలిసిందే.

రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రతిపాదన తదుపరి ఆమోదం కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోలు మండలి (డీఏసీ) ముందుకు వెళ్లనుంది. అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) దీనికి తుది ఆమోదముద్ర వేయనుంది. అంతా సవ్యంగా జరిగితే వచ్చే నెలలోనే భారత్, ఫ్రాన్స్ మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ప్రభుత్వాల మధ్య ఈ కొనుగోలు ప్రక్రియ జరగనుంది.

ఇదిలా ఉండగా, భారత నౌకాదళం కోసం రూ.63,000 కోట్ల విలువైన 26 రఫేల్-మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు గతేడాది ఏప్రిల్‌లో భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 22 సింగిల్-సీటర్ యుద్ధ విమానాలు, నాలుగు ట్విన్-సీటర్ శిక్షణ విమానాలు 2031 నాటికి అందనున్నాయి.

మరోవైపు, దేశీయంగా విమానయాన తయారీ రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, హైదరాబాద్‌లోని టాటా ప్లాంట్‌లో రఫేల్ విమానాల ఫ్యూసిలేజ్‌లను తయారు చేయనున్నారు. 2028 ఆర్థిక సంవత్సరం నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది.




More Telugu News