హైదరాబాద్‌లో 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్' ప్రారంభం.. రైడ్ ధర ఎంతంటే?

  • గోల్కొండ సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ఫెస్ట్ ప్రారంభం
  • హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
  • హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణం 45 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుందని వెల్లడి
హైదరాబాద్ నగరంలో రంగురంగుల 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివెల్' ప్రారంభమైంది. శుక్రవారం మొదలైన ఈ వేడుక ఆదివారం వరకు మూడు రోజుల పాటు జరగనుంది. గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ఉత్సవాలను ప్రారంభించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆకాశంలో గంటన్నర పాటు సుమారు 13 కిలోమీటర్లు ప్రయాణించారు. మంత్రి ప్రయాణించిన హాట్ ఎయిర్ బెలూన్ గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమై అప్పాజీగూడ శివారులో దిగింది. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించడం ఒక చిరస్మరణీయ అనుభవమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ ద్వారా రాష్ట్ర పర్యాటక శాఖ ఒక సరికొత్త అధ్యయనానికి నాంది పలికిందని ఆయన అన్నారు. ఉదయం 18 హాట్ ఎయిర్ బెలూన్లలో దాదాపు 40 మంది ప్రయాణించారు.

హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్, డ్రోన్ ఫెస్ట్, కైట్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలతో పర్యాటక శాఖ ప్రజలను ఆకట్టుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సంస్కృతి, సాంకేతికతల కలయికతో పర్యాటక శాఖ ముందుకు వెళ్తోందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. ఇలాంటి ఉత్సవాలు అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

హాట్ బెలూన్‌లో ప్రయాణించాలంటే?

ఈ హాట్ బెలూన్‌లో 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు ప్రయాణం ఉంటుందని, వాతావరణ పరిస్థితులను బట్టి 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ఒక్కో రైడ్‌కు రూ.2,000 ఉంటుందని వారు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులను బట్టి జనవరి 17, 18 తేదీలలో వేదికలను ఖరారు చేస్తామని అన్నారు. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రైడ్ ఉంటుందని అధికారులు తెలిపారు.


More Telugu News