Palla Srinivasa Rao: గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు వారికి టీడీపీ అండగా ఉంటుంది: పల్లా శ్రీనివాసరావు

TDP to support Telugu workers stuck in Gulf says Palla Srinivasa Rao
  • పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న టీడీపీ హైకమాండ్
  • ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ద్వారా బాధితులకు ఆహారం మరియు వసతి
  • కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ చర్యలు
  • బాధితుల కోసం 95500 57623, 79978 26882 హెల్ప్‌లైన్ నెంబర్లు
గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ చిక్కుకున్న తెలుగు వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తెలుగు బిడ్డలకు ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

గత నాలుగు రోజులుగా గల్ఫ్ దేశాల్లో మారుతున్న పరిణామాలను ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ నిశితంగా గమనిస్తోందని పల్లా వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు గల్ఫ్ దేశాల కోఆర్డినేటర్లతో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తోందని... ఎక్కడైతే అత్యవసర సహాయం అవసరమో, అక్కడ తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్కడి ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం సభ్యులు, తెలుగు సోదరులు బాధితులకు అవసరమైన తాత్కాలిక వసతి, ఆహారం, భద్రతా ఏర్పాట్లు చేయడంలో చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని పల్లా తెలిపారు. గల్ఫ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తున్నామని, ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ యంత్రాంగానికి తగు సూచనలు ఇస్తున్నారని చెప్పారు. అక్కడి తెలుగు వారికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే తమ ప్రథమ లక్ష్యమని, దీనికోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. కేంద్రం సహకారంతో ప్రభావితులందరికీ తక్షణ సాయం అందేలా చర్యలు ముమ్మరం చేశామన్నారు.

బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేందుకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 24/7 పనిచేసే ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. సహాయం కావాల్సిన వారు లేదా వారి బంధువులు హెల్ప్‌లైన్ నెంబర్లు 95500 57623, 79978 26882 లకు ఫోన్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ ద్వారా తమ వివరాలను పంపవచ్చని సూచించారు.

విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే, ప్రతి తెలుగు వ్యక్తికి క్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పల్లా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. సంక్షోభ సమయాల్లో వేగంగా స్పందించే సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రానికి ఉందని, బాధితులు ఆందోళన చెందవద్దని ఆయన ధైర్యం చెప్పారు. తెలుగు వారి భద్రత కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని తెలిపారు.
Palla Srinivasa Rao
Telugu Desam Party
TDP
Gulf Telugu people
NRI TDP
Andhra Pradesh
Chandra Babu Naidu
Gulf crisis
Telugu expats

More Telugu News