ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేయడంపై జీవీఎల్ నరసింహారావు స్పందన
- జర్నలిస్టుల అరెస్టులు ప్రభుత్వ పతనానికి దారితీస్తాయన్న జీవీఎల్
- అధికారంలో ఉన్నవారికి అన్ని వార్తలు నచ్చకపోవచ్చని వ్యాఖ్య
- మీడియాపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికి హానికరమన్న జీవీఎల్
ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్, హైదరాబాద్‌లోని ఎన్టీవీ కార్యాలయంలో పోలీసుల సోదాలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా సంస్థల్లో పోలీసు తనిఖీలు చివరికి ప్రభుత్వ పతనానికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.
అధికారంలో ఉన్నవారికి అన్ని వార్తలు నచ్చకపోవచ్చని, అంతమాత్రాన జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని, ఇది మీడియాను భయపెట్టే ధోరణిలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. వార్తా కథనం అసత్యమని భావిస్తే మీడియా సంస్థను వివరణ కోరవచ్చని లేదా బ్రాడ్‌కాస్టింగ్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. పోలీసు బలాన్ని ఉపయోగించి మీడియాపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు.