ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నారు: స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు

  • అనర్హత వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్
  • పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్యలకు ఊరట
  • రేపు అనర్హత పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో విచారణ
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది, అనంతరం అధికార పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలకు ఊరట లభించింది. వారి అనర్హత వ్యవహారంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ ఇచ్చారు. ఇరువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్యలు పార్టీ మారినట్లు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పీకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదివరకే ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వగా, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపాల్సి ఉంది. వీరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్యలకు సంబంధించిన ఫిరాయింపు ఫిర్యాదుపై తీర్పు వెలువరించడం గమనార్హం.


More Telugu News