ఇరాన్‌పై పంజా విసిరేందుకు ట్రంప్ సిద్ధం.. పెంటగాన్ సిద్ధం చేసిన '6 వ్యూహాలు' ఇవే!

  • ఇరాన్‌పై సైనిక చర్యకు దిగనున్న అమెరికా
  • నిరసనకారులపై అణచివేతే కారణమన్న ట్రంప్
  • అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులకు ప్రణాళికలు
  • ఖతార్‌లోని సైనిక స్థావరం నుంచి సిబ్బంది తరలింపు
  • యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్ ప్రతిస్పందన
ఇరాన్‌లో నిరసనకారులపై జరుగుతున్న అణచివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌పై సైనిక చర్య తీసుకునే అవకాశాలను వైట్‌హౌస్ చురుగ్గా పరిశీలిస్తోంది. నిరసనకారుల హత్యలకు ప్రతీకారంగా ‘చాలా బలమైన చర్య’ తీసుకుంటామని, వారికి ‘సహాయం రాబోతోంది’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

పెంటగాన్ అధికారులు ట్రంప్‌కు ఆరు రకాల ప్రత్యామ్నాయాలను అందించినట్టు తెలుస్తోంది. ఇందులో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC), బసిజ్ పారామిలటరీ దళాలకు చెందిన బ్యారక్‌లపై పరిమిత దాడులు చేయడం ఒకటి. అలాగే సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు, ఆయుధ డిపోలపై విస్తృత దాడులు చేయడం మరో ఆప్షన్. గతంలో జరిగిన 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్' తరహాలో ఫోర్డో, నతాంజ్ వంటి అణు కేంద్రాలపై దాడి, ఇరాన్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం, సైబర్ దాడులు, పూర్తి ఆర్థిక దిగ్బంధనం వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్‌లోని అల్-ఉదెయిద్ ఎయిర్ బేస్ నుంచి కొంతమంది అమెరికా సిబ్బందిని ముందుజాగ్రత్త చర్యగా తరలిస్తున్నారు. వైమానిక దాడులు కూడా పరిశీలనలో ఉన్నాయని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ధ్రువీకరించారు. మరోవైపు, తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ దానికి పూర్తి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికారి స్పష్టం చేశారు. తమపై దాడి జరిగితే, పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ అధికారి ఒకరు హెచ్చరించారు. 2025 జూన్‌లో అమెరికా ఇరాన్‌ అణు స్థావరాలపై దాడి చేయగా, ఇరాన్ ప్రతిగా ఖతార్‌లోని అమెరికా బేస్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.


More Telugu News