ఈపీఎస్ పింఛనుదారులకు శుభవార్త

  • పెన్షనర్లు ఇంట్లో నుంచే డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించుకునే విధానాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో
  • ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)తో ఎపీఎఫ్‌వో భాగస్వామ్యం 
  • లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించలేని పెన్షనర్లను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన వైనం
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పెన్షనర్లకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఒక ముఖ్యమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పెన్షనర్లు ఇకపై ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించే విధానాన్ని ప్రారంభించింది. దీని కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ)తో ఈపీఎఫ్‌వో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ప్రత్యేకంగా బ్యాంకులు లేదా ఈపీఎఫ్ కార్యాలయాలకు వెళ్లలేని వృద్ధులు, మొబైల్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించలేని పెన్షనర్లను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి తాజాగా ఒక సర్క్యులర్‌ను ఈపీఎఫ్‌వో జారీ చేసింది.

ఈ విధానంలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు చెందిన పోస్ట్ మ్యాన్ లేదా డాక్ సేవక్ నేరుగా పెన్షనర్ ఇంటికే వెళ్లి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ సేవకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఖర్చులన్నింటినీ ఈపీఎఫ్‌వో సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ అండ్ రికార్డ్ సెంటర్ (సీపీపీఆర్‌సీ) భరిస్తుంది.

డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందాలనుకునే పెన్షనర్లు ఐపీపీబీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పోస్ట్ మ్యాన్ లేదా డాక్ సేవక్ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్‌ను పూర్తి చేస్తారు. ఇతర పెన్షన్ స్కీమ్‌లతో పోలిస్తే భిన్నంగా, ఈపీఎస్ పెన్షనర్లు ఏ సమయంలోనైనా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఒకసారి సమర్పించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. 


More Telugu News