ధాన్యం కొనుగోలులో తెలంగాణ చారిత్రక మైలురాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఖరీఫ్ సీజన్‌లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
  • గతంలో 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించినట్లు వెల్లడి
  • రైతుల భాగస్వామ్యంతో రికార్డు సాధ్యమైందని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చారిత్రక మైలురాయిని అధిగమించిందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించిందని తెలిపారు. గతంలో కొనుగోలు చేసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్ సీజన్‌లో అధిగమించినట్లు వెల్లడించారు.

పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పాటు రాష్ట్ర రైతుల భాగస్వామ్యంతోనే ఈ రికార్డు సాధ్యమైందని మంత్రి స్పష్టం చేశారు. ధాన్య సంపదకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వం కొనుగోలు చేసిన 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా, 38.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్న రకాలని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో సాధించిన ఈ దిగుబడికి రాష్ట్రవ్యాప్తంగా 13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించామని ఆయన అన్నారు.


More Telugu News