కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్

  • కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంలో వాస్తవం లేదన్న టీపీసీసీ చీఫ్
  • కవిత ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
  • కాంగ్రెస్ నాయకులే అసలైన హిందువులు అన్న మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దోపిడీకి కవిత వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కవిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.  బీఆర్ఎస్‌ హయాంలో అవినీతి జరిగిందని స్వయంగా కవితనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

గతంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని విమర్శించారు. ఒక నియోజకవర్గం మూడు నాలుగు జిల్లాల్లో ఉందని, కేసీఆర్ తన కొడుకు కోసం, అల్లుడి కోసం, కూతురు కోసం ఒక్కో జిల్లా చేశారని ఆరోపించారు.

బీజేపీ గతమేనని, దానికి భవిష్యత్తు లేదని జోస్యం మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. బీఆర్ఎస్‌కు చరిత్రే మిగులుతుందని అన్నారు. దేవుడి పేరు ప్రస్తావించకుండా బీజేపీ రాజకీయం చేయదని విమర్శించారు. అసలైన హిందువులు కాంగ్రెస్ నాయకులేనని అన్నారు. తాము ఇంట్లో పూజిస్తామని, బయటకు వచ్చాక అన్ని మతాలను గౌరవిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నేతల దోపిడీపై ప్రశ్నిస్తే రాజకీయ ఆరోపణలు అంటారని, మరి కవిత ఆరోపణల సంగతి ఏమిటని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు. మేడారంలో మంత్రివర్గ 
సమావేశం ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

సినిమాల టిక్కెట్ ధరలను ఎంత పెంచకూడదని ప్రయత్నించినప్పటికీ, పరిశ్రమను ప్రోత్సహించేందుకు తప్పడం లేదని అన్నారు. పార్టీలో ఒకరికి రెండు నామినేటెడ్ పదవులు ఇవ్వవద్దని నిర్ణయించినట్లు చెప్పారు. ఐఏఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలు సరికాదని అన్నారు. ఇష్టారీతిన వార్తలు రాస్తే ఎలాగని ప్రశ్నించారు. మీడియాలో జరిగిన అసత్య కథనాలపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.


More Telugu News