రెడ్‌బుక్‌ను తగలబెట్టండి: యాంకర్ శ్యామల
- రెడ్ బుక్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న శ్యామల
- రెడ్ బుక్ పేరుతో పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారని మండిపాటు
- కూటమి ప్రభుత్వానికి తగిన సమయంలో ప్రజలు బుద్ది చెబుతారని వ్యాఖ్య
ఏపీ మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ పై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం వల్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి రైతు "అన్నమో రామచంద్ర" అంటూ లబోదిబో మంటూ ఏడుస్తున్నారని, వచ్చే రెండు సంక్రాంతుల్లో కూడా ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపించకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. కానీ 2029 తర్వాత వచ్చే సంక్రాంతి నాటికి ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు తెచ్చే బాధ్యతను వైసీపీ అధినేత జగన్ తీసుకుంటారని అన్నారు.
ఈ బోగి మంటల్లో రాష్ట్రానికి కీడుగా మారిన రెడ్‌బుక్‌ను తగలబెట్టాలని శ్యామల పిలుపునిచ్చారు. ఈ రెడ్‌బుక్ పేరుతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జోగి రమేశ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని ఆమె ఆరోపించారు.
కోడిని కోసినా కేసు, కేక్ కట్ చేసినా కేసు అన్నట్టుగా పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులకు ప్రజలే తగిన సమయంలో గట్టి సమాధానం చెబుతారని, రాష్ట్రంలో మళ్లీ న్యాయం, సంక్షేమం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.