మియాపూర్ లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూమికి హైడ్రా రక్షణ

  • మియాపూర్‌లో రూ. 3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
  • సర్వే నంబర్ 44లో 15 ఎకరాలకు పైగా భూమిని కాపాడిన హైడ్రా 
  • తప్పుడు పత్రాలతో కబ్జాకు యత్నించినట్లు అధికారుల నిర్ధారణ
  • ఆక్రమణల తొలగింపు.. భూమి చుట్టూ ఫెన్సింగ్, బోర్డుల ఏర్పాటు
  • కబ్జాకు యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. శేరిలింగంపల్లి మండలం, మక్తా మహబూబ్‌పేటలోని సర్వే నంబర్ 44లో ఉన్న సుమారు రూ. 3 వేల కోట్లకు పైగా విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ భూమి కబ్జాకు గురవుతోందని గతంలోనే హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు గతంలోనే ఐదు ఎకరాలను స్వాధీనం చేసుకుని, చెరువు కట్టపై నిర్మించిన 18 అక్రమ షెట్టర్లను తొలగించారు. అయితే, ఇదే భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, సంబంధిత సబ్-రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు గురయ్యారనే వార్తల నేపథ్యంలో హైడ్రా అధికారులు మరోసారి విచారణ చేపట్టారు.

ఈ విచారణలో, సర్వే నంబర్ 159కి చెందిన పత్రాలను ఉపయోగించి సర్వే నంబర్ 44లోని మొత్తం 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఎకరంన్నర భూమిని కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 

తాజాగా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన హైడ్రా, ఆక్రమణలను తొలగించి, భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసింది.


More Telugu News