రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

  • రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో దారుణం
  • నిన్న ఉరివేసుకుని ప్రియురాలు, నేడు పెట్రోల్ పోసుకుని ప్రియుడి బలవన్మరణం
  • రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఆత్మహత్యలు
రంగారెడ్డి జిల్లా, యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న ప్రియురాలు ఉరి వేసుకుని మరణించగా, నేడు ప్రియుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.

మేడిపల్లి గ్రామానికి చెందిన మహేశ్ (20), ఓ బాలిక (16) గత నాలుగు నెలలుగా ప్రేమలో ఉన్నారు. బాలిక ఇబ్రహీంపట్నంలోని కార్తికేయ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మహేశ్‌తో ఆమె ప్రేమలో పడింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిద్దరినీ కొంతకాలం పాటు కలవకుండా చేశారు.

పెద్దలు తమ ప్రేమను అంగీకరించి పెళ్లి చేయడం లేదని మనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట, గతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ తమ ఇళ్లలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగారు. అయితే, ఇరువురు కూడా ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డారు.

తాజాగా, సోమవారం మహేశ్ బాలికకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో మనోవేదనకు గురైన బాలిక మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణించిన విషయం తెలుసుకున్న మహేశ్, ఈరోజు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందాడు.


More Telugu News