మెడికల్ కాలేజీల పీపీపీ అంశంలో కీలక మలుపు.. హైకోర్టులో వైసీపీ పిల్

  • పీపీపీ ద్వారా 17 కాలేజీలను నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం
  • ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపించాలని హైకోర్టులో వైసీపీ పిల్
  • ఈరోజు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు

ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ ద్వారా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో వైసీపీ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.


ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ మెడికల్ కళాశాలలను తాము ఏర్పాటు చేశామని వైసీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల జోక్యం ఉండకూడదని, అలా జరిగితే పేదలకు వైద్య విద్యా అవకాశాలు దూరమవుతాయని ఆ పార్టీ వాదిస్తోంది. అప్పటి ప్రభుత్వం ఈ కళాశాలల నిర్వహణకు బడ్జెట్ భారం లేకుండా చూసుకునేలా విధానాలు రూపొందించిందని, కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్‌కు కేటాయించి ఆ ఆదాయాన్ని ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించేలా మార్గదర్శకాలు తయారు చేసిందని కోర్టుకు పిల్ లో వివరించింది.


పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో ఈ కళాశాలలను నడిపిస్తే వైద్య విద్య మాత్రమే కాకుండా, సామాన్యులకు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండవని, అవి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వైసీపీ తన పిల్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఆర్థిక భారం ఎక్కువగా ఉందన్నది వాస్తవం కాదని, ఇందుకు సంబంధించి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి కోటి సంతకాలు సేకరించామని కూడా కోర్టుకు తెలిపింది.

టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎంఎస్‌ఐడీసీ, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, నేషనల్ మెడికల్ కౌన్సిల్‌లను వైసీపీ చేర్చింది.



More Telugu News