ఏపీలో పోలీస్ స్టేషన్ ఎదుట దారుణ హత్య

  • శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు పీఎస్ ఎదుట హత్య
  • ఈశ్వరప్పను నరికి చంపిన అన్నదమ్ములు హరి, చెన్నప్ప
  • ఈ నెల 1న హరి భార్యను తనతో తీసుకెళ్లిన ఈశ్వరప్ప

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణ హత్య జరిగింది. ఈ తెల్లవారుజామున రాగినేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తిని అన్నదమ్ములు హరి, చెన్నప్ప కొడవళ్లతో నరికి చంపారు.  


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 1న హరి భార్యను ఈశ్వరప్ప తీసుకెళ్లాడు. దీంతో హరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. వారిద్దరూ గూడూరులో ఉన్నట్లు తెలుసుకుని ఆదివారం అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన సమయంలో కారు నుంచి దిగి స్టేషన్‌లోకి వెళ్తుండగా ఈశ్వరప్పపై హరి, చెన్నప్ప దాడి చేశారు. కొడవళ్లతో నరికి ఘటనాస్థలంలోనే హతమార్చారు.


ఈ దారుణ ఘటనతో అక్కడ ఉన్న హరి భార్య భయపడి అక్కడి నుంచి పరారైంది. పోలీసులు నిందితులైన హరి, చెన్నప్పలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలో విస్తృత చర్చనీయాంశమైంది. పోలీస్ స్టేషన్ ముందే ఇలాంటి దారుణం జరగడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



More Telugu News