చేతులకు సంకెళ్లతో నడిచి వస్తూ... "గుడ్ నైట్", "హ్యాపీ న్యూ ఇయర్" చెప్పిన మదురో... వీడియో ఇదిగో!

  • వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అమెరికా
  • హై-రిస్క్ ఆపరేషన్ తర్వాత న్యూయార్క్ జైలుకు తరలింపు
  • జైలుకు వెళుతూ 'హ్యాపీ న్యూ ఇయర్' అని వ్యాఖ్యానించిన మదురో
అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైనిక దళాలు బంధించాయి. వెనెజువెలా రాజధాని కారకాస్‌లో అత్యంత రహస్యంగా, హై-రిస్క్ ఆపరేషన్ నిర్వహించి మదురోను అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించాయి. డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాల అక్రమ సరఫరా వంటి తీవ్రమైన ఆరోపణలపై మదురోను అరెస్ట్ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

కాగా, మదురోను న్యూయార్క్‌లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌కు తరలిస్తున్నప్పటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు చెప్పులతో ఉన్న మదురో, తన పక్కనున్న వారిని ఆంగ్లంలో "గుడ్ నైట్.. హ్యాపీ న్యూ ఇయర్" అని విష్ చేయడం గమనార్హం. వాహనం నుంచి దిగుతున్నప్పుడు నొప్పితో మూలుగుతున్నట్లు కనిపించడంతో, అరెస్ట్ సమయంలో ఆయనకు గాయాలై ఉండొచ్చని ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది.

ఈ అనూహ్య పరిణామంతో వెనిజులా తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. కారకాస్‌లో భద్రతా బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో వెనిజులా సుప్రీం కోర్టు, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.


More Telugu News