న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక... పాండ్యాకు రెస్ట్

  • న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
  • కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
  • జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి
  • పనిభారం కారణంగా సిరీస్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా
  • జనవరి 11 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో స్థానం నిలుపుకున్నారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

అయితే, ఈ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ఆడేది, లేనిది ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు లభించింది. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లను ఎంపిక చేశారు.

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. అతను ఒక మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేసేందుకు ఇంకా సిద్ధంగా లేడని, రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని పనిభారాన్ని (వర్క్‌లోడ్) పర్యవేక్షిస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ జనవరి 11న వడోదరలో జరిగే తొలి వన్డేతో ప్రారంభమవుతుంది. రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్‌లో, చివరిదైన మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరుగుతుంది.

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.


More Telugu News