ఎంపీ ప్రియాంక చతుర్వేది లేఖ ఎఫెక్ట్! 'గ్రోక్'పై ఎక్స్‌కు కేంద్రం నోటీసులు

  • అసభ్యకర కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించిన కేంద్రం
  • మహిళల గౌరవం, గోప్యత, భద్రతను ఉల్లంఘిస్తోందని ఆగ్రహం
  • 72 గంటల్లో తొలగింపుకు సంబంధించి నివేదికను అందించాలని ఆదేశం
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్' కు చెందిన ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్'లో అసభ్యకర కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. గ్రోక్ సృష్టించిన అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార, సాంకేతిక శాఖ నోటీసులు జారీ చేసింది. తీసుకున్న చర్యల నివేదికను 72 గంటల్లో అందజేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనలు పాటించలేదంటూ 'ఎక్స్' భారత ప్రతినిధికి నోటీసులు జారీ చేసింది.

ఐటీ చట్టం-2000, ఐటీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు-2021ను 'ఎక్స్' సరిగ్గా అమలు చేయడం లేదని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా అశ్లీల, అసభ్య, పోర్నోగ్రాఫిక్, బాలలపై దౌర్జన్యానికి సంబంధించిన కంటెంట్ విషయంలో తగిన నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పేర్కొంది. నకిలీ ఖాతాలతో గ్రోక్ ఏఐని ఉపయోగించి మహిళల ఫొటోలు, అసభ్యకర వీడియోలు సృష్టిస్తున్నట్లు పేర్కొంది.

ఈ దుర్వినియోగం మహిళల గౌరవం, గోప్యత, భద్రతను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. కేవలం నకిలీ ఖాతాలకే పరిమితం కాకుండా, నిజమైన ఖాతాలపై ఉన్న మహిళల చిత్రాలను కూడా ఏఐ ప్రాంప్ట్‌ల ద్వారా వికృతంగా మార్చి ప్రచారం చేస్తున్నారని నోటీసులో పేర్కొంది. 'ఎక్స్'లో అసభ్యకర కంటెంట్‌కు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని పేర్కొంది.

అసభ్యకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, ఆధారాలను తారుమారు చేయవద్దని స్పష్టం చేసింది. అభ్యంతరకర కంటెంట్, యూజర్లు, అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏఐ గ్రోక్‌ను ఉపయోగించి మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేస్తున్నారని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎక్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరిన నేపథ్యంలో కేంద్రం నోటీసులు జారీ చేయడం గమనార్హం.


More Telugu News