ఆర్థిక సంక్షోభం... ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

  • ఇరాన్‌లో నిరసనకారుల పట్ల భద్రతా దళాలు వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ ఆగ్రహం
  • శాంతియుతంగా నిరసన చేపడుతున్న వారిపై కాల్పులు జరపవద్దన్న ట్రంప్
  • వారిని లక్ష్యంగా చేసుకుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని హెచ్చరిక
  • ట్రంప్ జోక్యంపై తీవ్రంగా స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ సీనియర్ సలహాదారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్‌లో నిరసనకారులపై అక్కడి భద్రతా దళాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న వారిపై కాల్పులు జరపవద్దని, అలాంటి వారిని అమెరికా కాపాడుతుందని అన్నారు.

శాంతియుతంగా ఆందోళన జరుపుతున్న వారిని లక్ష్యంగా చేసుకుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు. అమెరికా అన్నింటికీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారుడు అలీ లారిజాని తిప్పికొట్టారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతమంతా ఘర్షణలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. తమ జాతీయ భద్రత రెడ్ లైన్ వంటిదని, దీనిని పరీక్షించాలనుకోవడం సాహసమే అవుతుందని అన్నారు.

దేశంలో ధరలు పెరగడంతో పాటు కరెన్సీ విలువ పడిపోయింది. ఇరాన్ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దీంతో దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసనకారులు పోలీసుల కార్లకు నిప్పంటించారు. పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు కాల్పులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు.


More Telugu News