Hrithik Reddy: అపార్టుమెంట్‌లో అగ్ని ప్రమాదం... జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి

Hrithik Reddy Telangana student dies in Germany apartment fire
షార్ట్స్‌లో చూడండి
  ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన తెలంగాణ విద్యార్థి నూతన సంవత్సర వేడుకల వేళ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో, ప్రాణాలు కాపాడుకునేందుకు భవనంపై నుంచి దూకి తీవ్ర గాయాలతో మరణించాడు. ఈ ఘటన జనగామ జిల్లాలోని అతడి స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే, జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి (25) జర్మనీలోని మాగ్డెబర్గ్‌ నగరంలో గల యూనివర్సిటీ ఆఫ్ యూరప్ ఫర్ అప్లైడ్ సైన్సెస్‌లో ఎంఎస్ చదువుతున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో, తప్పించుకునే మార్గం లేక హృతిక్ భవనంపై నుంచి కిందకు దూకాడు.

ఈ ఘటనలో అతడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అక్రమంగా కాల్చిన బాణసంచా వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై జర్మన్ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

హృతిక్ తండ్రి తోకల సంపత్ రెడ్డి, బీజేపీ జనగామ జిల్లా అధికార ప్రతినిధి. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన హృతిక్, 2023 జూన్‌లో జర్మనీ వెళ్లాడు. కుమారుడి మరణవార్త తెలియడంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

హృతిక్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేయాలని అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ విషయంపై జర్మనీలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
Go Back to Shorts
Hrithik Reddy
Germany
Telangana student
Fire accident
Apartment fire
Jangaon district

More Telugu News