కొత్త ఏడాది మీకందరికీ మంచి జరగాలి: ఏపీ సీఎం చంద్రబాబు

  • నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ 
  • ఒక రోజు ముందుగానే పింఛను సొమ్ము అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
  • తమ ప్రభుత్వం ఇప్పటి వరకూ 50వేల కోట్లకు పైగా పింఛన్ల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 'ఎక్స్' వేదికగా సందేశం విడుదల చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, పింఛను సొమ్మును లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఒకరోజు ముందుగా అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటివరకు పింఛన్ల కోసం రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.

డిసెంబర్ నెలకు గాను 63.12 లక్షల మందికి పింఛన్లు అందించేందుకు రూ.2743 కోట్లను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, నూతన సంవత్సర శుభ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీనే ఇళ్ల వద్ద పింఛన్లు పంపిణీ చేసే ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.

పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించే పింఛన్ల పంపిణీ తమ ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చే సంక్షేమ కార్యక్రమమని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. 


More Telugu News