భారత్-పాక్ ఉద్రిక్తతలను మేమే తగ్గించాం.. చైనా సంచలన వ్యాఖ్యలు

  • భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించామన్న చైనా మంత్రి వాంగ్ యీ
  • ట్రంప్ తరహాలోనే శాంతి దూత‌గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీజింగ్
  • ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు ఆయుధాలు.. ఇప్పుడు శాంతి వచనాలు
  • డీజీఎంఓల చర్చల వల్లే సమస్య పరిష్కారమైందని గతంలోనే భార‌త్‌ స్పష్టీక‌ర‌ణ‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఇప్పుడు చైనా కూడా భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి స్థాపన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను (ఆపరేషన్ సిందూర్) తగ్గించడంలో తాము మధ్యవర్తిత్వం వహించామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సంబంధాల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాక్ ఉద్రిక్తతలను కూడా చైనా చొరవతోనే పరిష్కరించామని పేర్కొన్నారు. "మేము నిష్పక్షపాతంగా వ్యవహరించి, సమస్య మూలాలను అడ్రస్ చేశాం" అని వాంగ్ యీ చెప్పుకొచ్చారు. 

అయితే, భారత్ మాత్రం మూడో పక్షం జోక్యాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. మే 7న ప్రారంభమైన సైనిక ఘర్షణలు మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య జరిగిన ఫోన్ చర్చల ద్వారానే సద్దుమణిగాయని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. ఇందులో ఇతర దేశాల ప్రమేయం ఏమీ లేదని భారత విదేశాంగ శాఖ గతంలోనే స్ప‌ష్టం చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవైపు శాంతి గురించి మాట్లాడుతున్న చైనా.. మరోవైపు ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు భారీగా సైనిక సాయం అందించింది. పాక్ ఆయుధాల్లో 81 శాతం చైనా నుంచే వెళుతున్నాయి. శత్రువును దెబ్బకొట్టేందుకు పాక్‌ను ఒక ఆయుధంగా చైనా వాడుకుందని భారత ఆర్మీ అధికారులు విమర్శించారు.

మరోవైపు భారత్‌తో సంబంధాలు మెరుగుపడుతున్నాయని వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన ఎస్సీవో సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే అమెరికా సుంకాల యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తోందని, అయినప్పటికీ అమెరికాతో చర్చల ద్వారా ముందుకు వెళ‌తామని ఆయన పేర్కొన్నారు.


More Telugu News