యూట్యూబర్ అన్వేష్ దిష్టిబొమ్మ దగ్ధం... అతడి చానల్ నిషేధించాలన్న బీజేపీ నేతలు

  • హిందువుల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన అన్వేష్
  • మంగపేటలో బీజేపీ శ్రేణుల నిరసన
  • అన్వేష్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్

హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ములుగు జిల్లా మంగపేటలోని వైఎస్ఆర్ సెంటర్‌లో బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. యూట్యూబర్ అన్వేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రావుల జానకిరావు మాట్లాడుతూ, హిందూ సమాజాన్ని కించపరిచేలా, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన తప్పిదమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూట్యూబర్ అన్వేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


అదే సమయంలో అన్వేష్ నడుపుతున్న యూట్యూబ్ చానల్‌ను కూడా తక్షణమే నిషేధించాలని బీజేపీ నేతలు కోరారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.


యూట్యూబ్ వంటి డిజిటల్ మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, లేదంటే ప్రజా ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతాయని బీజేపీ నేతలు హెచ్చరించారు.



More Telugu News