USA Cricket: టీ20 వరల్డ్ కప్: కూనల పోరులో అమెరికా గెలిచింది!

USA Cricket Defeats Netherlands in T20 World Cup Clash
  • గ్రూప్-ఏ లో నెదర్లాండ్స్‌పై అమెరికా ఘన విజయం
  • తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేసిన యూఎస్ఏ
  • తెలుగు తేజం సాయితేజ అద్భుత అర్ధశతకం
  • లక్ష్య ఛేదనలో 103 పరుగులకే కుప్పకూలిన డచ్ జట్టు
  • 4 వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించిన హర్మీత్ సింగ్
టీ20 ప్రపంచకప్‌లో పసికూనల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో అమెరికా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం నాడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 93 పరుగుల భారీ తేడాతో గెలిచి జయభేరి మోగించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన అమెరికా... డచ్ జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమైన నెదర్లాండ్స్, అమెరికా ముందు తేలిపోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన అమెరికా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. తెలుగు తేజం సాయితేజ ముక్కామల (51 బంతుల్లో 79) అద్భుత అర్ధశతకంతో జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. క్రీజులో ఉన్నంతసేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ మోనాంక్ పటేల్ (36) రాణించగా, చివర్లో శుభమ్ రంజనే (24 బంతుల్లో 48 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అమెరికా భారీ స్కోరు చేయగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడ్ 3 వికెట్లు పడగొట్టినా, పరుగులు నియంత్రించడంలో విఫలమయ్యాడు.

అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు, అమెరికా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి, ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. కేవలం 15.5 ఓవర్లలోనే 103 పరుగులకే కుప్పకూలింది. డచ్ జట్టులో బాస్ డి లీడ్ (23), స్కాట్ ఎడ్వర్డ్స్ (20) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

అమెరికా బౌలర్లలో హర్మీత్ సింగ్ కేవలం 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. అతడికి తోడుగా షాడ్లీ వాన్ షాల్క్‌విక్ 3 వికెట్లు, మహ్మద్ మోహ్సిన్ 2 వికెట్లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
USA Cricket
T20 World Cup
United States
Netherlands
Sai Teja Mukkamalla
Harmeet Singh
New York
cricket match
Group A

More Telugu News