కార్ల్‌సన్‌కు అర్జున్ షాక్.. ఓటమిని త‌ట్టుకోలేక ప్రపంచ ఛాంపియన్ ఏం చేశాడో చూడండి..!

  • ప్రపంచ బ్లిజ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్‌కు షాకిచ్చిన అర్జున్ ఎరిగైసి
  • ఓటమిని జీర్ణించుకోలేక టేబుల్‌ను గట్టిగా కొట్టిన నార్వే స్టార్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కార్ల్‌సన్ ఆవేశం వీడియో
ప్రపంచ నెంబర్ 1 చెస్ క్రీడాకారుడు, ప్రస్తుత వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ మరోసారి సహనం కోల్పోయాడు. దోహా వేదికగా జరుగుతున్న ఫిడే (FIDE) వరల్డ్ బ్లిజ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చేతిలో ఓటమి పాలైన ఆయన.. తీవ్ర ఆవేశంతో టేబుల్‌ను కొట్టాడు. గత జూన్‌లో నార్వే చెస్ టోర్నీలో గుకేశ్‌ చేతిలో ఓడినప్పుడు కూడా కార్ల్‌సన్ ఇలాగే అసహనానికి గురయ్యాడు. ఇప్పుడు అర్జున్ చేతిలో ఓటమితో ఆయన ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు దీనిని 'కార్ల్‌సన్ అవుట్‌బర్స్ట్ 2.0'గా అభివర్ణిస్తున్నారు.

సోమవారం జరిగిన ఈ ఉత్కంఠ పోరులో అర్జున్ ఎరిగైసి నల్ల పావులతో ఆడుతూ అద్భుతమైన ఎండ్‌గేమ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. క్లిష్టమైన ఎత్తులతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. 9వ రౌండ్‌లో కార్ల్‌సన్‌పై విజయం సాధించిన అర్జున్, 10వ రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ నోడిర్‌బెక్ అబ్దుసతోరోవ్‌ను కూడా మట్టికరిపించాడు. 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో అర్జున్ ఎరిగైసి టోర్నీలో జాయింట్ లీడర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అర్జున్ ఎరిగైసి, ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్ 9 పాయింట్లతో ముందంజలో ఉండగా.. కార్ల్‌సన్, అలీరెజా ఫిరోజా, భారత్‌కు చెందిన సునీల్ దత్ నారాయణన్ 8 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు భారత యువ సంచలనాలు గుకేశ్‌, ప్రజ్ఞానంద 7.5 పాయింట్లతో 14వ స్థానంలో ఉన్నారు. ఆదివారం నాటి వరల్డ్ ర్యాపిడ్ టైటిల్ విజయంతో జోరుమీదున్న కార్ల్‌సన్, బ్లిజ్ టైటిల్ రేసులో వెనుకబడినప్పటికీ, ఇంకా పుంజుకునే అవకాశం ఉంది. మంగళవారం జరగనున్న చివరి రౌండ్ల తర్వాత టాప్-4 క్రీడాకారులు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.


More Telugu News