ఖలీదా జియాకు భారత్‌తో విడదీయలేని అనుబంధం.. బెంగాల్ గడ్డపైనే జననం!

  • అవిభాజ్య భారతంలోని పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ఖలీదా జియా
  • బంగ్లాదేశ్ రాజకీయాల్లో ధ్రువతారగా ఎదిగి, మూడుసార్లు దేశ పగ్గాలు చేపట్టిన వైనం
  • 80 ఏళ్ల వయసులో కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో పోరాడుతూ కన్నుమూత
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధ్యక్షురాలు ఖలీదా జియా (80) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢాకాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు బీఎన్‌పీ అధికారికంగా ప్రకటించింది.

ఖలీదా జియా మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగియడమే కాకుండా, భారత్‌తో బలమైన అనుబంధం ఉన్న ఒక నేత కనుమరుగయ్యారు. ఆమె 1946లో (కొన్ని రికార్డుల ప్రకారం 1945) అప్పటి అవిభాజ్య భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, జల్పాయిగురిలో జన్మించారు. ఆమె తండ్రి ఇస్కందర్ మజుందార్ అక్కడ వ్యాపారవేత్తగా ఉండేవారు. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత ఆమె కుటుంబం దినాజ్‌పూర్ (ప్రస్తుత బంగ్లాదేశ్)కు వలస వెళ్లింది. అలా ఆమె బాల్యం, మూలాలు భారత గడ్డతో ముడిపడి ఉన్నాయి.

1960లో సైనిక అధికారి జియావుర్ రెహ్మాన్‌ను వివాహం చేసుకున్న ఖలీదా.. అప్పటి వరకు గృహిణిగానే ఉండేవారు. అయితే 1981లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న జియావుర్ రెహ్మాన్ హత్యకు గురికావడంతో ఆమె అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1983లో బీఎన్‌పీ పగ్గాలు చేపట్టిన ఆమె జనరల్ ఎర్షాద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసి పోరాడారు.

1991లో బంగ్లాదేశ్‌లో జరిగిన తొలి స్వేచ్ఛాయుత ఎన్నికల్లో విజయం సాధించి, ఆ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు. ముస్లిం ప్రపంచంలో బెనజీర్ భుట్టో తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళగా ఆమె నిలిచారు. మొత్తం మూడు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన ఆమె.. బంగ్లా రాజకీయాల్లో అజేయ శక్తిగా ఎదిగారు. ఆమె మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రపంచ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.


More Telugu News