బ్యాడ్మింటన్ లో చర్రిత సృష్టించిన సూర్య చరిష్మ... గర్వపడుతున్నానంటూ మంత్రి నారా లోకేశ్ స్పందన

  • జాతీయ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ విజేత సూర్య చరిష్మ
  • ఏపీకి తొలిసారిగా మహిళల సింగిల్స్‌లో దక్కిన స్వర్ణ పతకం
  • విజేత సూర్య చరిష్మను అభినందించిన మంత్రి నారా లోకేశ్
  • పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న రిత్విక్ 
  • విజయవాడ వేదికగా ముగిసిన సీనియర్ నేషనల్స్ పోటీలు
ఆంధ్రప్రదేశ్‌కు ఇది చారిత్రక క్షణమని, 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సూర్య చరిష్మను చూసి గర్వపడుతున్నానని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రానికి మహిళల సింగిల్స్‌లో ఇదే మొట్టమొదటి జాతీయ స్వర్ణ పతకం అని ఆయన కొనియాడారు. ఇదే టోర్నీలో ఏపీ మహిళల జట్టు తొలిసారి రజతం గెలవడం కూడా గర్వకారణమని తెలిపారు. మహిళా శక్తి, పట్టుదల, సమష్టి కృషికి ఇది నిదర్శనమని, ఆంధ్ర ఆడబిడ్డలు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూ భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు.

విజయవాడ వేదికగా ఆదివారం ముగిసిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్థానిక క్రీడాకారిణి తమిరి సూర్య చరిష్మ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల సింగిల్స్‌లో రిత్విక్ సంజీవి ఛాంపియన్‌గా నిలిచాడు.

మహిళల సింగిల్స్ ఫైనల్‌లో 19 ఏళ్ల సూర్య చరిష్మ  17-21, 21-12, 21-14 తో  తన్వి పత్రిపై అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్‌లో ఓడిపోయినప్పటికీ, స్థానిక క్రీడాకారిణి కావడంతో ప్రేక్షకుల నుంచి లభించిన గట్టి మద్దతుతో పుంజుకుని అద్భుతంగా పునరాగమనం చేసింది. ఇక పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో రిత్విక్ సంజీవి 21-16, 22-20 తేడాతో భరత్ రాఘవ్‌పై గెలుపొందాడు.

ఇతర విభాగాల్లో, మహిళల డబుల్స్‌లో శిఖా గౌతమ్-అశ్విని భట్ జోడీ, పురుషుల డబుల్స్‌లో హరిహరన్-రుబన్ కుమార్ జంట విజేతలుగా నిలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి-రాధిక శర్మ జోడీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.


More Telugu News